Adani Enterprises Rout Row: ఆదానీ గ్రూపునకు సంబంధించి అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ వెల్లడించిన నివేదిక నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనం కావడం దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఆదానీ కంపెనీల విషయంలో దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల వద్ద ఈ నెల 6వ తేదీ (సోమవారం) నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలకు సూచనలు ఇవ్వాలని పీసీసీలను కోరినట్లు ఆయన చెప్పారు. ప్రధానికి సన్నిహితులైన మిత్రుల కోసం ప్రజల కష్టార్జితాన్ని పణంగా పెట్టడం ప్రభుత్వానికి తదగని అన్నారు.

ఆదానీ వ్యాపార లావాదేవీలపై సమగ్ర విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ని నియమించాలంటూ పార్లమెంట్ లో విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఆ గ్రూపు షేర్లలో అవకతవకలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తొంది. అదానీ వ్యవహరం వల్ల ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆ గ్రూపులో పెట్టిన పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనయ్యాయని కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు, శివసేన, బీఆర్ఎస్, ఆప్ తదితర పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆదానీ పై హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక గుర్తించి చర్చించాలంటూ కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఉభయ సభల్లో నిన్న ఇచ్చిన వాయిదా తీర్మానాలకు సభాపతి అంగీకరించకపోవడంతో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ కార్యకలాపాలను అడ్డుకోవడంతో ఉభయ సభలు స్తంబించిపోయాయి.
ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తో కలిసి విపక్షాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కోట్ల మంది ప్రజలు పెట్టుబడులు ఉన్నాయనీ, వారి సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడిందన్నారు.
ప్రదాన మంత్రి మోడీకి సన్నిహితుడుగా పేరున్న గౌతమ్ ఆదానీకి సంబంధించి సంస్థలు అవకతవకలకు పాల్పడినట్లుగా హిండెన్ బర్గ్ నివేదిక లో పేర్కొనడం, ఆ వెంటనే ఆదానీ గ్రుప్ షేర్లు భారీగా పతనం కావడం అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలకు మంచి ఆయుధం దొరికినట్లు అయ్యింది.