YS Jagan: దాదాపు రూ.200 కోట్ల ఖర్చుతో ఢిల్లీలో సెంట్రల్ విస్టా పేరుతో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తొలి దశ ప్రధాన నిర్మాణాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే పార్లమెంట్ స్పీకర్ నుండి దేశంలోని ముఖ్యమంత్రులు, పార్టీలకు అహ్వానాలు అందాయి. అయితే రాజ్యాంగ వేదిక అయిన పార్లమెంట్ ను రాజ్యాంగ పరిరక్షణ కర్త అయిన రాష్ట్రపతి ప్రారంభించాలి కానీ ప్రధాన మంత్రి ప్రారంభించడం ఏమిటంటూ కాంగ్రెస్ తో సహా పలు విపక్షాలు తప్పుబడుతున్నాయి.

ఈ క్రమంలో అనేక తర్జన భర్జనల అనంతరం కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (ఉద్దవ్ ఠాక్రే), సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, జేఎంఎం, ఎన్సీపీ, సీపీఎం, ఆర్ జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఎండిఎంకే, కేరళ కాంగ్రెస్ (మణి), వీసీకే, ఆర్ఎల్డీ, టీఎంసీ, జేడీ (యూ) వంటి 19 పార్టీలు ఈ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. “పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతితో కాకుండా ప్రధాని మోడీ ప్రారంభించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఈ తీరు రాజ్యాంగ స్పూర్తిని ఉల్లంఘించడం కిందికే వస్తుంది. ఈ అప్రజాస్వామిక చర్యలు ప్రధాని మోడీకి కొత్తేమి కాదు. పార్లమెంట్ లో విపక్ష నేతలు భారత ప్రజల సమస్యలను లేవనెత్తినప్పుడు వారిపై అనర్హత వేటు వేశారు. సస్పెండ్ చేశారు. వారి మాటలను మ్యూట్ చశారు. పార్లమెంట్ నుండి ప్రజాస్వామ్య స్పూర్తిని పక్కన పెట్టినప్పుడు ఇక కొత్త భవనంలో మాకు ఏ విలువా కనిపించడం లేదు” అని విపక్ష పార్టీలు తమ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.
బీఆర్ఎస్, టీడీపీ దీనిపై ఎటువంటి కామెంట్స్ చేయలేదు. వ్యతిరేకిస్తున్నట్లుగా గానీ సమర్ధిస్తున్నట్లుగా ఈ పార్టీలు ప్రకటన విడుదల చేయలేదు. ఏపి సీఎం జగన్మోహనరెడ్డి మాత్రం ప్రధాన మంత్రి మోడీని అభినందిస్తూ.. విపక్షాల తీరును తప్పుబడుతూ ట్వీట్ చేశారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయబోతున్న ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేసిన సీఎం జగన్.. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కన పెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హజరు కావాలని కోరుతున్నానన్నారు. నిజమైన ప్రజాస్వామ్య స్పూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ హజరవుతుందని తెలిపారు.
YS Jagan: జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్ .. ప్రతిపక్షాలపై మరో సారి ఫైర్