Chhattisgarh: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు అమలు అవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలోనూ అత్యవసరాలకు అంటే మందులు, ఆసుపత్రులకు వెళ్లే వారిని అనుమతి ఉంటుంది. అయితే ప్రభుత్వం లాక్ డౌన్ కఠినంగా అమలు చేయమన్నది కదా అని వివిధ ప్రాంతాల్లో పలువురు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుంటారు. లాక్ డౌన్ సమయాల్లో రోడ్లపైకి వచ్చి వారిపై లాఠీలతో ప్రతాపం చూపుతున్నారు. చత్తీస్‌గడ్ లోని సూరజ్ పుర్ జిల్లా కలెక్టర్ లాక్ డౌన్ సమయంలో చేసిన వీరంగం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన ఉద్యోగానికే ఎసరు వచ్చింది. కేసులోనూ ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విషయం ఏమిటంటే.. ఇటీవల లాక్ డౌన్ పర్యవేక్షిస్తున్న సురజ్ పుర్ జిల్లా కలెక్టర్ రణ్ వీర్ శర్మ ఓ యువకుడు రోడ్డుపైకి రావడం చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను మందుల కొనుగోలుకు వెళుతున్నానని చెబుతున్నా వినిపించుకోకుండా అతని సెల్ ఫోన్ తీసుకుని నేలకేసి కొట్టడంతో పాటు చెంప చెళ్లు మనింపించాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న పోలీసులను పిలిచి ఆ వ్యక్తిని కొట్టాలని ఆదేశించాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరర్ అయ్యింది. అత్యున్నత హోదాలో ఉన్న కలెక్టర్ ఇలా చేయడం ఏమిటంటూ పెద్ద ఎత్తున నెటిజన్ల నుండి విమర్శలు వచ్చాయి.
Chhattisgarh: కలెక్టర్‌కు ఊస్టింగ్ ఆర్డర్స్
ఈ ఘటనపై ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ తీవ్రంగా స్పందించారు. వెంటనే కలెక్టర్ ను విధుల నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.