Assembly Elections Polling Updates: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. రెండు రాష్ట్రాలు మిజోరాం, చత్తీస్ గఢ్ లో ఇవేళ ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. మిజోరాంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నేడు పోలింగ్ జరుగుతుండగా, చత్తీస్ గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఇవేళ 20 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
చత్తీస్ గఢ్ లో ఇటీవల బీజేపీ నేతను మావోయిస్టులు హత్య చేయడంతో ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. చత్తీస్ ఘట్ లో తొలిదశ పోలింగ్ జరుగుతున్న 20 స్థానాల్లో 12 స్థానాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. మవోయిస్టుల ఎన్నికల బహిష్కరణ హెచ్చరికల నేపథ్యంలో డ్రోన్లు, హెలికాఫ్టర్ ల ద్వారా వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ నక్సల్స్ దాడులు కలకలం రేపుతున్నాయి.
ఈ ఉదయం సుక్మా జిల్లాలోని తొండమార్కా ప్రాంతంలో నక్సల్స్ ఏర్పాటు చేసిన ఐఈడీ పేలడంతో ఓ జవాను గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా కోంటా ప్రాంతంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ పై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో డీఆర్జీ బలగాలు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపారు. సుక్మాలోని నక్సల్స్ ప్రభావిత కరిగుండం ప్రాంతంలో 23 ఏళ్ల తర్వాత ఓటింగ్ జరుగుతోంది. సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్, జిల్లా బలగాల భద్రతతో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నక్సల్ ప్రభావిత బస్తర్, జగదల్ పూర్, చిత్రకోట్ లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా, సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగియనుంది.
ఎన్నికల పోలింగ్ సందర్భంగా చత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భఘేల్ మీడియాతో మాట్లాడుతూ .. అయిదేళ్లలో తాము చేసిన పనితో నక్సలిజం చాలా వరకు తగ్గుముఖం పట్టిందని, ఫలితంగా గ్రామాల్లోనే పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు తమ గ్రామాల్లోనే ఓటు వేస్తున్నారన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. చత్తీస్ గఢ్ కాంగ్రెస్ ఎప్పుడూ సామాన్య ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతోందని పేర్కొన్నారు.
కాగా మిజోరాం ముఖ్యమంత్రి జోరంధంగా అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముందుగా ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ బూత్ వద్దకు వచ్చి కొద్ది సేపు వేచి ఉండి అసహనంతో వెళ్లిపోయిన సీఎం .. ఆ తర్వాత మళ్లీ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడైన సీఎం జోరంథంగా ఇజ్వాల్ నార్త్ – 2 నియోజకవర్గ పరిధిలోని 19 ఇజ్వాల్ వెంగ్లాయ్ – 1 పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
చత్తీస్ గఢ్ లో తొలి విడత పోలింగ్ జరిగే 20 స్థానాల్లో 223 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. మిగిలిన 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. ఇక మిజోరాం లో ఒకే విడతలో జరిగే 40 స్థానాలకు 174 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
‘రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు’