లోక్ సభ సభ్యుడిగా తనపై అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలి సారి మీడియా మందుకు వచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఇవేళ ఆయన మీడియాతో మాట్లాడారు. తనను అనర్హుడుగా ప్రకటించినంత మాత్రన భయపడేది లేదనీ, మోడీ సర్కార్ ను తాను ప్రశ్నలు అడగడం మానే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. భయపడటం అనేది తన చరిత్రలోనే లేదనీ, తనను అరెస్టు చేసినా వెనుకాడబోనని అన్నారు.

దేశంలో ప్రజా స్వామ్యం దాడికి గురవుతోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఇందుకు ఉదహరణలు ఉన్నాయని చెప్పారు. ఆదానీ – మోడీ మధ్య స్నేహంపైనా ప్రశ్నలు సంధించారు రాహుల్. నిబంధనలకు విరుద్దంగా ఎయిర్ పోర్టులను ఆదానీకి కట్టబెడుతున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. దాని గురించి మాట్లాడినందుకే తనపే విమర్సలు చేస్తున్నారని అన్నారు. ఆదానీ గురించి మాట్లాడినందుకే తనపై అనర్హత వేశారని రాహుల్ ఆరోపించారు. జీవితాంతం తనను అనర్హుడుగా ప్రకటించినా, తన పని తాను చేసుకుంటానని చెప్పారు. తాను పార్లమెంట్ లో ఉన్నా, బయట ఉన్నా తేడా ఏమి లేదని, ఎక్కడైనా ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు.
భారత ప్రజాస్వామ్యం గురించి లండన్ లో తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ స్పష్టం చేశారు. భారతదేశ వ్యవహారాల్లో అంతర్జాతీయ శక్తులు జోక్యం చేసుకోవాలని తాను వ్యాఖ్యానించినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. దీనిపై కేంద్ర మంత్రులు అబద్దాలు చెబుతున్నారని అన్నారు. తనపై చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరినా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని వివరించారు. మోడీపై చేసిన వ్యాఖ్యలకు మోడీకి క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ నేతల డిమాండ్ పై స్పందిస్తూ తాను సావర్కర్ ను కాదు.. గాంధీని .. క్షమాపణ చెప్పబోను అని స్పష్టం చేశారు.
మరో పక్క రాహుల్ కు మద్దుతుగా కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా భారీ ప్రదర్శనలు నిర్వహించారు. రాహుల్ పై అనర్హత వేటును నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాయి. కేరళలోని వాయనాడ్ లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నిరసన కారులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. చండీగఢ్ లో యూత్ కాంగ్రెస్ నేతలు రైల్ రోకో నిర్వహించారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ఎమ్మెల్యేలు మౌన నిరసన చేశారు. అసెంబ్లీ బయట భైటాయించి నిరసన వ్యక్తం చేశారు.
విద్యుత్ వినియోగదారులకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్