ఢిల్లీ లో ఆప్ సర్కార్ అధికారాలకు గండికొట్టే విధంగా కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోరుకు సిద్దమవుతున్నారు. ఓ పక్క న్యాయపోరాటం చేయడంతో పాటు విపక్షాలను కూడగట్టే పనిలో నిమగ్నమైయ్యారు. ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్రం అర్డినెన్స్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిని విపక్షాల ఐక్యతతో రాజ్యసభలో అడ్డుకోవచ్చని అంటున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ బిల్లును అడ్డుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్న సందేశం ప్రజల్లోకి వెళుతుందని ఆయన అంటున్నారు.

విపక్షాల ఐక్యతే లక్ష్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో నితీష్ కుమార్, బీహార్ డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్ లు భేటీ అయ్యారు. కేంద్రంప పోరుకు ఆయనకు మద్దతుగా ఉండేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తానని నితీష్ కుమార్ అరవింద్ కేజ్రీవాల్ కు హామీ ఇచ్చారు. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మాట్లాడతానని నితీష్ పేర్కొన్నారు.
విపక్షాలను కూడగట్టే కార్యక్రమంలో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ .. ఎల్లుండి (మంగళవారం) కోల్ కతాలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుస్తానని తెలిపారు. ఆ తర్వాత దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులను కలవడానికి వెళ్తానన్నారు. అన్ని పార్టీలతో మాట్లాడాలని నితీష్ కుమార్ ను అభ్యర్ధించినట్లు చెప్పారు. ఒక్కో రాష్ట్రానికి వెళ్లి ఒక్కో నేతను నేరుగా కలుస్తానని, రాజ్యసభ ముందుకు ఈ బిల్లు వచ్చినప్పుడు అడ్డుకోవాలని కోరతానని చెప్పారు. వర్తమాన రాజకీయ పరిస్థితులతో పాటు ఢిల్లీ లో బ్యూరోక్రాట్ల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ గురించి నితీష్ తో మాట్లాడతానని, కేంద్రం తేనున్న ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చినప్పుడు అడ్డుకోవాలని నితీష్ ను కోరినట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
Machilipatnam: టీడీపీ నేతలపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు