Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. అదివారం ఉదయం ఆయన సీబీఐ అధికారుల విచారణకు హజరుకాగా దాదాపు 8 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. అయితే విచారణలో అడిగిన ప్రశ్నలకు సిసోడియా సంతృప్తికర సమాధానాలు ఇవ్వనందున ఆయనను అరెస్టు చేసినట్లుగా సీబీఐ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ పలువురుని అరెస్టు చేసింది.

ఆదివారం విచారణ సమయంలో ఢిల్లీ న్యూ లిక్కర్ పాలసీ పై అనేక కోణాల్లో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. దినేశ్ అరోరా సహా ఈ కేసులో ఇతర నిందితులతో సంబంధాలపై ఆరా తీశారు సీబీఐ అధికారులు. వారితో జరిపిన సంభాషణలపైనా ప్రశ్నించారు. అయితే .. సిసోడియా విచారణకు సహకరించలేదని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. అనేక విషయాల్లో స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదనీ, అందుకే ఆయనను అరెస్టు చేసినట్లు తెలిపారు సీబీఐ అధికారులు.

అయితే సిసోడియా అరెస్టుపై ఆదివారం ఉదయం నుండే జోరుగా ఊహాగానాలు వచ్చాయి. సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు సిసోడియా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అంతకంతకూ పెరుగుతున్న ప్రజా దరణ చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భయపడుతున్నారనీ, అందుకే సీబీఐ, ఈడీ తో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారనీ, సీబీఐ, ఈడీ తప్పుడు కేసులకు తాము భయపడమని సిసోడియా పేర్కొన్నారు.
డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు పై ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మనీష్ అమాయకుడనీ, ఆయనను అరెస్టు చేయడం నీచరాజకీయమని విమర్శించారు. మనీష్ అరెస్టు పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోందన్నారు. ప్రజలు అన్నీ చూస్తున్నారనీ, అర్ధం చేసుకుంటారని అన్నారు. దీనిపై ప్రజలు స్పందిస్తారని పేర్కొన్నారు. తమ పోరాటం మరింత బలపడుతుందని అన్నారు.