ఆ టీకా పై వైద్యులకే అనుమానాలు..! సామాన్యుల పరిస్థితి ఏమిటి.?

హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ పై అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని ట్రయిల్స్ పూర్తి కాకుండానే ఈ వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) అసుపత్రి రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డీఏ) తమకు అక్స్ ఫర్డ్ – అస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకా మాత్రమే ఇవ్వాలని మెడికల్ సూపరింటెండెంట్ ను కోరింది. ఈ మేరకు అసోసియేషన్ లేఖ కూడా రాసింది.

Doctors have doubts about the vaccine ..! What is the condition of the common people ..?

కోవాగ్జిన్ వద్దు..కోవిషీల్డ్ ముద్దు

వ్యాక్సిన్ ఎంపికలో ప్రజలకు అప్షన్ లేదనీ ప్రభుత్వం రెండు వ్యాక్సిన్ లలో ఏది ఇస్తే అది తీసుకోవాల్సిందేనని ఇటీవల కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా స్పష్టమైన ప్రకటన చేసిన తరువాత కూడా డాక్టర్స్ అసోసియేషన్ యే తమకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కావాలనీ, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ పై తమ వైద్యులలోనే కొన్ని సందేహాలు, స్వల్పంగా భయాందోళనలు ఉన్నాయనీ పేర్కొనడం గమనార్హం. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో కోవిషీల్డ్ కాకుండా కోవాగ్జిన్ మాత్రమే ఇవ్వనున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపిన డాక్టర్స్ అసోసియేషన్..కోవాగ్జిన్ విషయంలో అన్ని ట్రయిల్స్ పూర్తి కాలేదని వెల్లడించింది. కోవిషీల్డ్ టీకా విషయంలో అన్ని స్థాయిల్లో ట్రయల్స్ పూర్తి అయ్యాయని గుర్తు చేసింది.

భారత్ బయోటెక్ భరోసా కల్పిస్తున్నా..

అయితే కోవాగ్జిన్ అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సంస్థ ప్రజల్లో భయోందోళనలు కల్గించేందుకు భరోసా కల్పించేలా ప్రకటన కూడా జారీ చేసింది. కోవాగ్జిన్ టీకా వల్ల ఏమైనా దుష్ప్రభావం తలెత్తితే అటువంటి వారికి ఆసుపత్రుల్లో చేర్చి పూర్తి చికిత్స ఉచితంగా అందించడంతో పాటు నష్టపరిహారం కూడా చెల్లిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో కరోనా టీకా తీసుకునేందుకు వచ్చిన వారితో అంగీకార పత్రంపై సంతకం చేయించుకుంటున్నారు. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో వారం రోజుల్లోగా తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తితే నష్టపరిహారం ఇవ్వనున్నట్లు పత్రంలో స్పష్టం చేశారు. గత నెల మొదటి వారంలో హర్యానాకు చెందిన ఓ మంత్రి వాలంటీర్ గా కోవాగ్జిన్ టీకా వేయించుకున్న తరువాత కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కూడా తీవ్ర దుమారాన్ని రేపింది. అయితే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న తరువాతనే దాని ప్రభావం ఉంటుందని నాడు కంపెనీ వివరణ ఇచ్చింది. వ్యాక్సిన్ పట్ల సామాన్య ప్రజానీకంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ కేంద్రం అనుమానాలను నివృత్తి చేస్తూ వివరణ కూడా ఇచ్చింది. అయితే ఢిల్లీలోని ఒ పెద్ద అసుపత్రికి చెందిన వైద్యులే ఇప్పుడు కోవాగ్జిన్ టీకా వద్దంటూ సూపరిటెండెంట్ కు లేఖ రాయడం ప్రజల్లో మరింత భయాందోళనలు రేకెత్తించే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో సదరు కంపెనీ, ప్రభుత్వం వైద్యులు, ప్రజలకు పూర్తి స్థాయిలో భరోసా, అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తొలి రోజు లక్షా 90 వేల మందికిపైగా వ్యాక్సినేషన్

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి రోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించగా సుమారు లక్షా 90 వేల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. తొలి రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియలో పెద్దగా దుష్ప్రభావాలు ఏమి కనబడలేదు.