చత్తీస్‌ఘడ్ బొగ్గు లెవీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. మొత్తం 14 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. వారందరూ చత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బాగేల్ సన్నిహితులని సమాచారం. కొందరు రాజకీయ నేతలు, అధికారులు రూ.540 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారన్నది ఈడీ అభియోగం. ఈ కుంభకోణం నిధులను ఖైరాఘడ్ ఉప ఎన్నికలకు వినియోగించారని ఈడీ ఆరోపిస్తున్నది. గత ఏడాది అక్టోబర్ లో ఈడీ జరిపిన దాడుల్లో రూ.4 కోట్ల నగదు, ముఖ్యమైన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా జరిగిన ఈడీ దాడులపై సీఎం భూపేష్ బాగేల్ స్పందించారు. చత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోశాధికారి, పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే సహా తన సహచరుల ఇళ్లపై ఈడీ ఈ రోజు దాడులు చేసిందన్నారు. మరో నాలుగు రోజుల తర్వాత రాయ్‌పూర్ లో కాంగ్రెస్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యల వల్ల తమ సహచరుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం, ఆదానీకి సంబంధించిన నిజానిజాలు బట్టబయలు కావడంతో బీజేపీ నిరుత్సాహానికి గురైందన్నారు. ఈ రైడ్స్ దాని దృష్టి మరల్చే ప్రయత్నమని విమర్శించారు. దేశానికి నిజం తెలుసు. పోరాడి గెలుస్తామని సీఎం భూపేష్ బాగేల్ ట్వీట్ చేశారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నివాసంపై దుండగుల దాడి .. ఇది నాల్గవ సారి అంటూ అసదుద్దీన్ ట్వీట్