Breaking: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి గట్టి షాక్ లు తగులుతున్నాయి. కొందరు సిట్టింగ్ లకు సీట్లు నిరాకరించడంతో వారు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా బీజేపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ .. కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య, ఏఐసీసీ నేత రణదీప్ సుర్జీవాలా సమక్షంలో జగదీశ్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, మల్లికార్జున ఖర్గే ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగదీశ్ షెట్టర్ పార్టీలో చేరడంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ .. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. షెట్టర్ చేరికతో కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రముఖ లింగాయత్ నాయకుడైన జగదీశ్ షెట్టర్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. 2012 నుండి 2013 వరకూ రాష్ట్రానికి 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ టికెట్ నిరాకరించడంపై జగదీశ్ షెట్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో సేవ చేసిన తనను కరివేపాకులా తీసి పారేశారంటూ పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. కేంద్ర నాయకత్వంపై తనకు విశ్వాసం ఉన్నప్పటికీ కేవలం రాష్ట్ర నేతలే పార్టీ నుండి నెట్టేసారని ఆయన ఆరోపించారు. నిన్న మధ్యాహ్నం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ రాజీనామా పత్రాన్ని స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరికి అందజేశారు. తనకు పార్టీ అధిష్టానం రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని ఆఫర్ చేసిందనీ, అయితే అందుకు తాను నిరాకరించినట్లు తెలిపారు షెట్టర్.
జగదీశ్ షెట్టర్ రాజీనామా చేయడంపై మాజీ సీఎం యడజియూరప్ప స్పందించారు. ఆయనకు పార్టీ ఏమి అన్యాయం చేశామని ప్రశ్నించారు. ఆయనను తమ ప్రాంత ప్రజలు క్షమించరని అన్నారు. షెట్టర్ ను రాజ్యసభ సభ్యుడిగా చేసి కేంద్ర మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం ఆఫర్ చేసిందని యడియూరప్ప చెప్పారు. కానీ ఆయన బీజేపీకి ద్రోహం చేశారని అన్నారు. అందుకే రాష్ట్ర పర్యటన చేసి ఆయన చేసిన ద్రోహాన్ని చెబుతానని ఆయన అన్నారు. కర్ణాటకలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని, స్పష్టమైన మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తామని యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు.