కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (75 ) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిని మీడియాకు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు గురుగ్రామ్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయానికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారనీ, తాము సీపిఆర్ ప్రయత్నించడంతో పాటు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లా లో 1947 జూలై 1న జన్మించిన శరద్ యాదవ్ .. విద్యార్ధి నేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ వ్యతిరేకిగా పేరు తెచ్చుకున్న శరద్ యాదవ్ .. ప్రముఖ సోషలిస్ట్ నేత జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం పాటు ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కాంగ్రెస్, రాజకీయ ప్రత్యర్ధి లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపారు. 2015 ఎన్నికల తర్వాత బీహార్ లో మహాకూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన శరద్ యాదవ్ 1999 నుండి 2004 మధ్య వాజ్ పేయి ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2003 లో జనతాదళ్ యూనైటెడ్ (జేడీయూ) జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైయ్యారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఏడు సార్లు లోక్ సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 2017 లో బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనతో విభేదించి జేడీయు నుండి బయటకు వచ్చారు. 2018 లో లోక్ తాంత్రిక్ జనతాదళ్ (ఎల్ జే డీ) పార్టీ ఏర్పాటు చేశారు. గత ఏడాది మార్చిలో ఆర్డేడీ లో విలీనం చేసినట్లు ప్రకటించారు.
శరద్ యాదవ్ మృతికి ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. పీఎం మోడీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. సుదీర్ఘ ప్రజాజీవితంలో ఎంపిగా, మంత్రిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. డాక్టర్ లోహియా భావజాలం నుండి ప్రేరణ పొందారని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. శరద్ యాదవ్ తన రాజకీయ సంరక్షకుడని బీహార్ మాజీ డిప్యూటి సీఎం సుశీల్ కుమార్ మోడీ పేర్కొన్నారు. తాను ఉప ముఖ్యమంత్రి కావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడని, ఈ విషయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. శరద్ యాదవ్ మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. శరద్ యాదవ్ మృతి వార్త తనను బాధించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.