మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి తన రాజకీయ పార్టీ ఎన్నికల గుర్తు, మేనిఫెస్టో ప్రకటించారు. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడు నెలల క్రితమే తన రాజకీయ పార్టీ కల్యాణ రాజ్య ప్రగతిని ప్రకటించిన గాలి జనార్తన్ రెడ్డి ఇవేళ పార్టీ ఎన్నికల గుర్తు ను ప్రకటించారు. తమ పార్టీ ఎన్నికల గుర్తు ఫుట్ బాల్ గా తెలిపిన ఆయన.. రాజకీయాల్లో ఉన్నప్పుడు సొంత పార్టీ తో పాటు శత్రువులు ఫుట్ బాల్ ఆడుకున్నారనీ, ఇప్పుడు తాను ఆడుకుంటానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో 12 మందితో తొలి అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు.

గంగావతి నుండి తాను పోటీ చేస్తానని తెలిపిన జనార్ధనరెడ్డి.. తన సతీమణి అరుణ లక్ష్మి బళ్లారి నుండి పోటీలో ఉంటారని వెల్లడించారు. మరో పది మందికి సైతం టికెట్లను కేటాయించారు. బళ్లారికి గాలి జనార్థన్ రెడ్డి వెళ్లొద్దని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్కడి నుండి తన భార్యను పోటీ చేయిస్తున్నారు. మైనింగ్ కుంభకోణం కేసులో జనార్థన్ రెడ్డిని సిబీఐ అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే రాజకీయ పార్టీని స్థాపించే సమయంలో తనకు బీజేపీలో తాను సభ్యుడిని కాదనీ, బీజేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కళ్యాణ ప్రగతి పక్ష పార్టీ కర్ణాటక లోని తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం. దాదాపు 15 జిల్లాల్లో తమ పార్టీ సంస్థాగత పనులు కొనసాగుతున్నాయని జనార్థన్ రెడ్డి తెలిపారు.
అబివృద్ధి లేని గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం పర్యిటిస్తున్నట్లు తెలిపారు. తన పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తూ .. అయిదు ఎకరాల కన్నా తక్కువ ఉన్న రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.15వేలు ఇస్తామని వెల్లడించారు. వార్షిక ఆదాయం అయిదు లక్షల కన్నా తక్కువ ఉన్న వారికి ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. మహిళలు, నిరుద్యోగులకు నెలకు రూ.2,500 ఇస్తామని ప్రకటించారు. ఇళ్లులేని కుటుంబాలకు మహిళల పేరుతో రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. మరిన్ని పథకాలను సైతం అమలు చేస్తామని వెల్లడించారు.
రాహుల్ గాంధీకి మరో షాక్ .. ప్రభుత్వం బంగళా ఖాళీ చేయాలంటూ నోటీసు