సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అతిలోక సుందరి శ్రీదేవికి అరుదైన గౌరవం లభించింది. జాతీయ స్థాయిలో అగ్రశేణి నాయకగా పేరు సంపాదించుకున్న శ్రీదేవి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉండగానే 2018లో ప్రమాదవశాత్తు మరణించారు. కాగా ఇవేళ శ్రీదేవి 60వ పుట్టిన రోజు (జయంతి) సందర్భంగా గూగూల్ ప్రత్యేక డూగుల్ తో గౌరవించింది. ముంబాయికి చెందిన భూమిక అనే ఆర్టిస్ట్ వేసిన శ్రీదేవి అందమైన చిత్రాన్ని గూగుల్ డూడుల్ గా పోస్టు చేసింది.

తమిళనాడులో 1963 ఆగస్టు 13న పుట్టిన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్. సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తన పేరును శ్రీదేవిగా మార్చుకున్నారు. టీనేజ్ లోనే హీరోయిన్ గా చిత్ర సీమకు అడుగుపెట్టిన శ్రీదేవి .. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. శ్రీదేవికి మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కొన్ని దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి.. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకున్నారు. వారికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇద్దరు కుమార్తెలు. శ్రీదేవి 60వ జయంతి సందర్భంగా గూగుల్ తన డూడుల్ గా శ్రీదేవి ఫోటోని డిస్ ప్లే చేసి గౌరవించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది.
Telangana BJP: ఫలించని ఈటల ప్రయత్నాలు .. బీజేపీకి బైబై చెప్పిన మాజీ మంత్రి చంద్రశేఖర్