BJP: కేంద్రంలోని మోడీ సర్కార్ పదవీ కాలం ఇంకా ఎనిమిది నెలలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం నేపథ్యంలో త్వరలో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే ఆ ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికలపై పడుతుందన్న భావనతో బీజేపీ ముందస్తుకు వెళ్లే ఆలోచన చేస్తుందనే వార్తలు వినబడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న కీలక పరిణామాలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకూ అయిదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రత్యేక సమావేశాల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్, జమిలి ఎన్నికల బిల్లు తదితర కీలక బిల్లులను ఆమోదించుకుని లోక్ సభ రద్దు పై సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సమావేశాల్లోనే పలు సంక్షేమ కార్యక్రమల మీద బిల్లులు ప్రవేశపెట్టి చట్టాలుగా తీసుకుని రావడం ద్వారా ఈ ప్రత్యేక సమావేశాలను వాడుకోవాలన్న ఆలోచన చేస్తుందన్న వార్తలు షికారు చేస్తున్నాయి.
బీహార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, మమత బెనర్టీలు ఇటీవల ముందస్తు ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కార్ ముందస్తుకు యోచన చేస్తుందని వారు కీలక కామెంట్స్ చేశారు. ముందస్తుగా లోక్ సభ రద్దు చేస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇతర రాష్ట్రాలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే లోక్ సభ రద్దు ప్రతిపాదన చేయవచ్చని భావిస్తున్నారు. అయిదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే ప్రతిపక్ష ఇండియా కూటమికి అది అడ్వంటేజ్ అవుతుందని కమలనాధులు భావిస్తున్నారుట. ఇండియా కూటమి బలపడేందుకు అవకాశం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలు తీసుకువస్తే మరల కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చనే ఆలోచనలో బీజేపీ ఉందని అంటున్నారు. ఇప్పటికే పలు జాతీయ సర్వేలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని వెల్లడించిన నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తుందా అనే చర్చ జరుగుతోంది.

మరో పక్క క్యాబినెట్ కార్యదర్శులు, వివిధ శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఢిల్లీలోనే ఉండాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. పీఎంఓ అనుమతి లేనిదే ఉన్నతాధికారులు ఎవ్వరూ ఢిల్లీ వదిలి వెళ్లరాదని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక జమిలి ఎన్నికలు అంటే దేశంలో అనేక రాష్ట్రాలు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకే సారి ఫిబ్రవరిలోనే జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వంపై మహిళల్లో ఉన్న వ్యతిరేకతను కొంత మేర పొగొట్టుకునేందుకు రీసెంట్ గా వంట గ్యాస్ ధరలను రూ.200లు తగ్గించారనీ, మరో 75 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించాలని నిర్ణయాన్ని బీజేపీ సర్కార్ తీసుకుందని విపక్షాలు పేర్కొంటున్నాయి.
కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్ సిలెండర్ ధర సుమారు రూ.400లు ఉండగా, ఇప్పుడు రూ.వెయ్యి దాటిపోయింది. ఇది సామాన్యులకు పెను భారంగా మారింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కొంత వ్యతిరేక ఉన్నప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్ అంత బలంగా లేకపోవడం ఎన్డీఏకి అడ్వాంటేజ్ అని, ఇప్పుడు ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడి బలపడే ప్రయత్నం చేస్తున్నందున బీజేపీ కూడా ఎన్డేఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశాలను నిర్వహిస్తొంది. గతంలో ఎన్డీఏ నుండి బయటకు వెళ్లిన పార్టీలను దగ్గరకు చేర్చుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముందస్తు ఊహగానాలు బలంగా వినిపిస్తున్నాయి. చూడాలి ఏమి జరుగుతుందో.