World Cup 2023: వన్డే వరల్డ్ కప్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవేళ సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబాయిలోని వాంఖడే మైదానంలో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంటుందని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ బెదిరింపు నేపథ్యంలో ముంబయి పోలీసులు అప్రమత్తమైయ్యారు. వాంఖడే స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
వాంఖడే మైదనంలో ఈ మధ్యాహ్నం 2 గంటల నుండి మ్యాచ్ ప్రారంభం కానుండగా, ఈ మ్యాచ్ జరిగే సమయంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంటుందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) లో బెదిరింపులకు పాల్పడ్డాడని ముంబయి పోలీసులు తెలిపారు. తన పోస్టును ముంబయి పోలీసులకు ట్యాగ్ చేసిన ఆ ఆగంతకుడు.. తుపాకీ, హ్యాండ్ గ్రనేట్, బుల్లెట్ ఉన్న ఫోటోను షేర్ చేశాడు. దీంతో పోలీసులు స్టేడియం, ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
అయితే, వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లకు బెదిరింపులు రావడం ఇదే ప్రధమం కాదు. అక్టోబర్ 14న జరిగిన భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ సమయంలోనూ ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ అంతర్జాతీయ స్టేడియంపై దాడి చేస్తామంటూ ఈ మెయిల్ రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. దీంతో ముమ్మర దర్యాప్తు జరిపిన పోలీసు అధికారులు ఆ సందేశం పంపిన నిందితుడిని అరెస్టు చేశారు.
IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ కీలకం..!!