Sharad Pawar: ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రెండు రోజుల క్రితం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. శరద్ పవార్ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ తో నేతలు అజిత్ పవార్, సుప్రియా సులే తదితర ముఖ్యనేతలు చర్చలు జరిపిన నేపథ్యంలో రాజీనామా నిర్ణయంపై పునరాలోచన చేస్తానని శరద్ పవార్ వారికి హామీ ఇస్తూ రెండు రోజుల సమయం ఇవ్వాలని కోరారు.

బీజేపీలో కలిసేందుకే శరద్ పవార్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది ఈ తరుణంలో ముంబాయిలో ఎన్సీపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఎన్సీపీ అధ్యక్షుడుగా శరద్ పవార్ కొనసాగించాలని తీర్మానించింది. ఆయన రాజీనామాను ఆమోదించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. కింది స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకూ ఎవరూ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. దీంతో కోర్ కమిటీ కూడా శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించింది. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ తీర్మానం చేసింది.
కాగా కోర్ కమిటీ నేతలు చేసిన తీర్మానం వివరాలను స్వయంగా వెళ్లి శరద్ పవార్ కు తెలియజేశారు ఎన్సీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రపుల్ పటేల్. పార్టీ అధ్యక్షుడుగా కొనసాగాలని కోరారు. అయితే తీర్మానంపై ఆలోచించి నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని పవార్ కోరినట్లు ప్రపుల్ పటేల్ వెల్లడించారు. కోర్ కమిటీ సమావేశానికి సభ్యులు సుప్రియా సూలే, అజిత్ పవార్, ప్రపుల్ పటేల్, ఛగన్ భుజ్ బల్ సహా 18 మంది సీనియర్ నేతలు హజరైయ్యారు. సమావేశంలో శరద్ పవార్ రాజీనామాను తిరస్కరిస్తూ ఓ తీర్మానం ప్రవేశపెట్టగా దాన్ని కమిటీ ఆమోదించింది. పార్టీ అధ్యక్షుడుగా పవార్ కొనసాగాలని అభ్యర్ధిస్తూ మరో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది కోర్ కమిటీ. కమిటీ నిర్ణయంతో ఎన్సీపీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
YS Viveka Murder Case: సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి