Neeraj Chopra: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ ప్రవర్తన సరిగా లేదంటూ వారు కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరి ఆందోళనపై ఒలంపిక్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయిర్ నీరజ్ చోప్రా ఇవేళ స్పందించారు. వారికి తన మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. రెజ్లర్ల సమస్య పరిష్కారం కోసం అధికారులు త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. న్యాయం కోసం రెజ్లర్లు వీధుల్లో ధర్నా చేయడం తనను కలిచివేస్తొందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశం తరపున పోటీ పడేందుకు అథ్లెట్లు ఎంతో కృషి చేశారు. దేశానికి గర్వకారణంగా నిలిచారు. ప్రతి ఒక్క పౌరుడి సమగ్రతను, మర్యాదను కాపాడే బాధ్యత మనదే. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు ఇక ఎప్పుడూ జరగకూడదు. ఇది చాలా సున్నితమైన అంశం. చాలా పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఈ సమస్యను పరిష్కరించాలి అని కోరారు. అథ్లెట్లకు న్యాయం జరిగేలా అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినోశ్ ఫోగట్, సాక్షి మాలిక్, భజరంగ్ పూనియాతో పాటు అనేక మంది టాప్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకునే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఇటీవల రెజ్లర్ల కు మద్దతుగా ఒలింపిక్ పతక విజేత అభినవ్ బింద్రా కూడా ట్వీట్ చేశారు.
— Neeraj Chopra (@Neeraj_chopra1) April 28, 2023