BJP National Executive Meeting LIVE: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే నిర్వహిస్తున్న ఈ సమావేశాలు సోమవారం నాడు ఢిల్లీలోని ఎన్ డీ ఎం సీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభం అవ్వగా, సమావేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర మంత్రలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 350 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనే ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. ఇటీవల గుజరాత్ లో బీజేపీ ఘన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో మెగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాని మోడీకి పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశాల్లో త్వరలో జరగనున్న తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్ సభ ఎన్నికలు తదితర అంశాలతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా పదవీ కాలం పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది.

వచ్చే నెలలో జేపి నడ్డా పదవీ కాలం ముగియనుండగా, పదవీ కాలం పొడిగింపునకు పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తొలి రోజు సమావేశాలు పూర్తి అయిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ ఇవేళ జాతీయ కార్యవర్గ సమావేశంలో త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ మరియు కర్ణాటక పార్టీ కార్యకలాపాలపై ఆయా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నివేదికలు సమర్పించారని తెలిపారు. కర్ణాటక సీఎం, త్రిపుర సీఎం కూడా తమ తమ రాష్ట్ర పార్టీ అధ్యక్షులతో సమావేశానికి హాజరయ్యారని చెప్పారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపుపై ఏమైనా చర్చ జరిగిందా అని మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..దానిపై చర్చ జరగలేదని పేర్కొన్నారు. నేటి జాతీయ కార్యవర్గ సమావేశంలో కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తమ నివేదికలను సమర్పించగా, రేపు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ మరియు మిజోరాం రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు తమ నివేదికలను సమర్పించనున్నారు. అయితే జేపి నడ్డా పదవీ కాలం పొడిగింపు అంశంపై రేపు అధికారికంగా ప్రకటన వెలువడుతుందా లేదా అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన జేపి నడ్డా 2023 (ఈ ఏడాది) సంవత్సరం తమకు ఎంతో కీలకమని అన్నారు. ఈ ఏడాది జరగబోయే 9 రాష్ట్రాల ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని బీజేపీ కార్యవర్గానికి పిలుపునిచ్చారు. తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బీజేపీ ఇప్పటి వరకూ లక్షా 30వేల పోలింగ్ బూత్ లకు చేరుకుందనీ, బలహీనంగా ఉన్న 72వేల పోలింగ్ బూత్ లను బలోపేతం చేసుకోవాలని నడ్డా చెప్పారు. ఈ సమావేశాల్లో దేశంలో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిస్థితులు, సామాజిక సమస్యలపై చర్చ జరిపి పలు తీర్మానాలు ఆమోదించనున్నారు.