Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 278కి చేరింది. మరో 900 మందికిపైగా గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ తీవ్ర విషాద ఘటనలో నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణీకులు మృతి చెందినట్లుగా తెలుస్తొంది. ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శనివారం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరమని అన్నారు. ప్రమాదానికి కారణాలు ఇప్పటికిప్పుడు చెప్పలేమని అన్నారు. ప్రమాద ఘటనపై విచారణ చేసి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలపై పూర్తిగా దృష్టి పెట్టామన్నారు. ఘటనాస్థలిలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరి కొద్ది సేపటిలో ఘటనా స్థలానికి బయలుదేరుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ప్రధాని మోడీ .. కటక్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో ఘటనా స్థలం పోలీసులు తనిఖీలు, బందోబస్తు చర్యలు చేపట్టారు.
మరో పక్క రైలు ప్రమాదం నేపథ్యంలో 43 రైళ్లను రద్దు చేశారు. 38 రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. హౌరా – సికింద్రాబాద్, హౌరా హైదరాబాద్, హౌరా – తిరుపతి రైళ్లు రద్దు చేసారు. సికింద్రాబాద్ – షాలిమార్ రైలు దారి మళ్లించారు. బెంగళూరు – గౌహతి రైలు విజయనగరం, టిట్లాగఢ్, టాటా మీదుగా దారి మళ్లించారు.