Rajanikanth: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక విమానంలో ఆమెరికా బయలుదేరారు. వైద్య చికిత్స కోసం రజనీ యూఎస్ వెళుతున్నట్లు సమాచారం. రజనీకాంత్ 2016 మే నెలలో అమెరికాలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ చేయించుకున్నారు. అప్పటి నుండి ప్రతి ఏటా వైద్య పరీక్షల నిమిత్తం వెళుతున్నారు.
అయితే గత ఏడాది కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో అమెరికా వెళ్లలేకపోయారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షల నిమిత్తం ఈ సారి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతులతో అమెరికా బయలుదేరినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు రజనీకాంత్ అమెరికాలోనే ఉండనున్నారు. కుమార్తె ఐశ్వర్య, అల్లుడు నటుడు ధనుష్ హాలీవుడ్ షూట్ కారణంగా ప్రస్తుతం ఆమెరికాలోనే ఉండగా రజనీకాంత్ తన సతీమణి లతతో కలిసి బయలుదేరి వెళ్లారు.
ఇక సినిమాల విషయానికి వస్తే రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాతై సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతార, ఖుష్బూ, జగపతిబాబు, కీర్తి సురేశ్ నటిస్తున్నారు.