రాజస్థాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జలూర్ జిల్లాలోని మహేష్పూర్లో శనివారం రాత్రి విద్యుత్ తీగలు తగలడంతో ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో మంటలు చెలరేగడంతో ఆరుగురు మృతి చెందగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. మాండోర్ నుండి బేవార్ వరకు బస్సు వెళుతుండగా బస్సు డ్రైవర్ పొరపాటున దారి తప్పి మహేశ్ పూర్ గ్రామం వైపు వెళ్ళాడు. ఈ మార్గంలో బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి.

బస్సు డ్రైవర్, కండక్టర్ అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 17 మందిని జోధ్పూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జులూర్ జిల్లా అదనపు కలెక్టర్ చాగన్ లాల్ గోయల్ ఆసుపత్రికి చేరుకుని బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.