RBI: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సంచలన నిర్ణయం ప్రకటించింది. రూ.2వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు (మే 19వతేదీ) నుండి రూ.2 వేల నోటు జారీ నిలిపివేసిస్తునట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఈ నోట్లను సర్క్యులేషన్ లో ఉంచొద్దని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది. అయితే ఈ నోట్ల ను పూర్తిగా రద్దు చేయడం లేదనీ, ఇప్పటికీ లావాదేవీలకు ఈ నోట్లను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఎవరి వద్దనైనా ఈ నోట్లు కలిగి ఉన్న వారు మే 23 నుండి అన్ని బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ రీజనల్ బ్రాంచ్ లో మార్చుకోవచ్చని సూచించింది. ఒక విడత గరిష్టంగా రూ.20వేల వరకూ మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. డిపాజిట్ విషయంలో మాత్రం ఎలాంటి నిబంధనలు విధించలేదు. బ్యాంకు రోజు వారీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా నోట్ల మార్పిడి ప్రక్రియ చేపట్టాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.

క్లీన్ నోట్ పాలసీలో భాగంగా తాజాగా రూ.2వేల నోట్లను చలామణిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్ బీఐ తెలిపింది. ఎన్నికల ఏడాదిలో ఆర్బీఐ రూ.2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మోడీ ప్రభుత్వం డీమానిటైజేషన్ చేసిన తర్వాత 2016 నుండి మార్కెట్ లో చెలామణిలో ఉంది. ఈ నోటు చెలామణి పై మొదటి నుండి అనేక అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇటీవలే ఈ నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ క్రమంలో రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకోవాలని తాజాగా ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో బ్లాక్ మనీ విషయం మరో సారి తెరపైకి వస్తొంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రూ.2వేల నోట్లను నిల్వ చేసిన వారు ఆందోళన చెందుతున్నారు.