సుప్రీం కోర్టు తీర్పుతో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. అయితే ఆ తర్వాత ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కాగానే ఎంసీడీ సదన్ రసాభాసాగా మారింది. స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే సమయంలో సభ్యులు తమ సెల్ ఫోన్ లను తీసుకువెళ్లడానికి అనుమతిస్తున్నామని మేయర్ షెల్లీ ఒబెరాయ్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ కౌన్సిలర్ లు వ్యతిరేకించారు. మేయర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెల్ లోకి వచ్చి బీజేపీ కౌన్సిలర్ లు నినాదాలు చేశారు. మేయర్ నిర్ణయానికి మద్దతుగా ఆప్ కౌన్సిలర్లు నినాదాలు చేయడంతో సదన్ లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో సభ్యుల మధ్య తోపులాట జరిగింది. సభ్యులు ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లు, పేపర్లు, చేతికి దొరికిన ప్రతి వస్తువును విసురుకున్నారు. ఈ నేపథ్యంలో మేయర్ స్టాండింగ్ కమిటీ ఓటింగ్ ప్రక్రియను పలు మార్లు వాయిదా వేశారు. రాత్రి అంతా ఎంసీడీ సదన్ లో హైడ్రామా కొనసాగింది. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికను మేయర్ రేపటికి వాయిదా వేశారు.

దీనిపై మేయర్ షెల్లీ ఒబెరాయ్ బీజేపీ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తుండగా బీజేపీ సభ్యులు వెల్ లోకి రావడమే కాకుండా తనపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. మహిళా మేయర్ పై దాడికి యత్నించడం బీజేపీ నేతల గుండాగిరికి నిదర్శనమని ఆమె ట్వీట్ చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. సదన్ లో బీజేపీ సభ్యుల ప్రవర్తన దిగ్భాంతి కలిగించిందని, ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు.

తీవ్ర ఉత్కంఠ మధ్య బుధవారం జరిగిన ఢిల్లీ మేయర్ ఎన్నికలో ఆప్ అభ్యర్ధి షెల్లీ ఒబెరాయి బీజేపీ అభ్యర్ధి రేఖా గుప్తా పై 34 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఈ సారి ఓటమి పాలైంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన ఆధిక్యత సాధించినప్పటికీ నామినేటెడ్ సభ్యుల బలంతో మేయర్ పీఠాన్ని దగ్గించుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తూ ఎల్జీ తీసుకున్న నిర్ణయాన్ని ఆప్ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఎల్జీ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.