జాతీయ పార్టీ కాంగ్రెస్ లో కీలక పరిణామం చొటుచేసుకోబోతున్నది. ఈ నెల 24వ తేదీ నుండి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీలో వేగంగా పావులు కదులుతున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో తొలి సారి గాంధీ కుటుంబానికి చెందని నేతకు పార్టీ పగ్గాలు అందే అవకాశాలు కనబడుతున్నాయి. రాహుల్ గాంధీ మరో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు విముఖత చూపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ పదవి కోసం గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోటీ పడుతున్నారు. మరో వైపు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ తాను పోటీ చేస్తానని ముందుకు వచ్చారు. ఈ విషయంపై శశిధరూర్ రీసెంట్ గా సోనియా గాంధీతో భేటీ అయి చర్చించినట్లు తెలుస్తొంది. శశిధరూర్ పోటీకి సోనియా గాంధీ అనుమతి లభించినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

పార్టీలో అంతర్గతంగా సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న నేతల్లో శశిధరూర్ కూడా ఉన్నారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ 2020 లో సోనియా గాంధీకి లేఖ రాసిన జి – 23 నేతల్లో శశిధరూర్ ఒకరు. ఈ నేపథ్యంలో ఆయన అధ్యక్ష పదవికి పోటీ పడుతుందటం ఆసక్తి కరంగా మారింది. మరో పక్క రాహుల్ గాంధీనే మరో సారి పార్టీ పగ్గాలు చేపట్టాలని వివిధ రాష్ట్రాల క్యాడర్ కోరుకుంటోంది. ఈ మేరకు రాష్ట్రాల్లో సమావేశాలను నిర్వహించి తీర్మానాలు చేసి పంపుతున్నారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం తన మనసులో మాట బయట పెట్టలేదు. ప్రస్తుతం ఆయన భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని కోరుకునే వ్యక్తుల్లో గెహ్లాట్ ఒకరు. అయితే శశిధరూర్ కూడా తాను పోటీకి సై అంటూ సోనియా గాంధీ కలవడం పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

సొనియా గాంధీ 19 సంవత్సరాల పాటు పార్టీ చీఫ్ గా వ్యవహరించిన తర్వాత 2017లో తన కుమారుడు రాహుల్ గాంధీకి అ బాధ్యతలు అప్పగించారు. అయితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రాహుల్ తన బాధ్యతల నుండి తప్పుకోవడంతో మళ్లీ సోనియా గాంధీనే పార్టీ పగ్గాలు చేపట్టారు. గాంధీల కుటుంబం నుండి కాకుండా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన చివరి బయట వ్యక్తి సీతారాం కేసరి. 1998లో ఆయన నుండి సోనియా గాంధీ పార్టీ బాధ్యతలు స్వీకరించారు. పీవి నర్శింహరావు సర్కార్ ఓడిపోయిన తర్వాత పార్టీ చాలా బలహీనంగా మారడంతో సోనియా గాంధీ రంగంలోకి దిగారు. అయితే వివిధ రాష్ట్ర పార్టీల నుండి వస్తున్న డిమాండ్ కు తలవొగ్గి రాహుల్ మరల అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి అంగీకరిస్తారా లేక శశిధరూర్, గెహ్లాట్ లలో ఎవరినైనా నిలుపుతారా అనేది ఈ నెల 24 తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.