Smriti Irani: పశ్చిమ బెంగాల్ లో మూడవ సారి అధికారం చేపట్టిన టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీని నిత్యం ఇరుకున పెట్టేందుకు బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి, ఫైర్ బ్రాండ్ మహిళా నేత ను బెంగాల్ పార్టీ ఇన్ చార్జిగా నియమించింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయినా బెంగాల్ లో రాజకీయ కాక కొనసాగుతూనే ఉంది. ఎలాగైనా దీదీని గద్దె దింపి అధికారంలోకి రావాలన్న కమలనాధుల ఎత్తులు పారలేదు. అయితే ఇప్పుడు మమత బెనర్జీ ప్రభుత్వాన్ని ఇంటా బయట ఇరుకున పెట్టడానికి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నేతగా దీదీపై విజయం సాధించిన సువేందు అధికారిని ఎన్నుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా మమతా బెనర్జీకి మహిళా ప్రత్యర్థిని రంగంలోకి దించింది బీజేపీ. బెంగాల్ పార్టీ ఇన్ చార్జిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని నియమించింది. తన వాక్‌చాతుర్యంతో ప్రత్యర్థులపై విమర్శల దాడి చేసే స్మృతి ఇరానీని బెంగాల్ ఇన్ చార్జిగా నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల ఆయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బెంగాల్ లో ఎన్నికలు జరిగాయి. మునుపెన్నడూ లేని విధంగా ఎనిమిది విడతలుగా ఎన్నికలు జరగ్గా ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బీజేపీ సర్వశక్తులు వడ్డింది ప్రధాన మంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి బహిరంగ సభల్లో, ర్యాలీల్లో పాల్గొన్నారు.
మమతను అదికార పీఠంను దూరం చేసేందుకు మోడీ, షా ద్వయం అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ బీజెపీ ప్రయత్నాలు ఫలించలేదు. అయితే అసెంబ్లీలో బీజేపీ బలాన్ని గణనీయంగా పెంచుకుంది. మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్ లో ఓటమి పాలవ్వడం ఆ పార్టీకి కొంత ఇబ్బంది కల్గించే అంశంగా మారింది. అయినప్పటికీ మెజార్టీ స్థానాల కైవశంతో దీదీ మూడవ సారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ప్రధాన ప్రతిపక్ష నేత సువేందు అధికారి, రాష్ట్ర పార్టీ ఇన్ చార్జి స్మృతి ఇరానీ ల దూకుడు చర్యలను దీదీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.