కర్ణాటకలో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తొంది. సీఎం కుర్చీ ఆశిస్తున్న ఇద్దరు నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లలో ఎవరిని ఎంపిక చేయాలా? అని పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతుండగా, మరో నాయకుడి పేరు తెరపైకి వచ్చింది. సిద్దా రామయ్య, డీకే శివకుమార్ తో ఢిల్లీలో అధిష్టానం పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఈ తరుణంలో తమకూరు జిల్లా కొరటగెరె ఎమ్మెల్యే పరమేశ్వర్ ను సీఎం చేయాలంటూ భారీ ర్యాలీ చేపట్టారు ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.

demand congress high command to make mla Parmeshwar as Karnataka cm
దళిత వర్గానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి పదవికి పరమేశ్వర్ పేరును కూడా పరిశీలించాలని కాంగ్రెస్ అధిష్టానానికి డిమాండ్ చేశారు. జిల్లాలో పార్టీ పటిష్టం చేసేందుకు ఆయన అన్ని విధాలుగా కృషి చేశారని కార్యకర్తలు తెలిపారు. తమకూరు నగరంలోని కాంగ్రెస్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ భద్రమ్మ సర్కిల్ వరకు కొనసాగింది. పరమేశ్వర్ ఇంతకు ముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొరటగెరె అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే పరమేశ్వర్ స్పందించారు. సీఎం పదవి చేపట్టాలని అధిష్టానం ఆదేశిస్తే తాను ఆ బాధ్యతలు స్వీకరించడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం తాను ఏ విధంగా కృషి చేశానో అధిష్టానానికి తెలుసునని అన్నారు. సీఎం పదవి కోసం లాబీయింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు.
మరో పక్క సిద్ద రామయ్య, డీకే శివకుమార్ ల వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ నేతనే సీఎం అవుతారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరు సిద్దా రామయ్యకు పార్టీ హైకమాండ్ అవకాశం కల్పిస్తుందని చెబుతుండగా, మరి కొందరు మాత్రం డీకే శివకుమార్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం దూతలు సేకరించారు. అయితే ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలన్న ప్రతిపాదనను డీకే శివకుమార్ ఒప్పుకోవడం లేదని తెలుస్తొంది. ఈ పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య ఎలా రాజీ కుదిర్చి సీఎం అభ్యర్ధిని ఎంపిక చేస్తుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
DK Sivakumar: సీఎం పదవిపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు