తమిళనాడు రాజకీయ పార్టీ ఏఐఏడీఎంకే చీఫ్ గా పళని స్వామి ఉంటారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామి (ఈపీఎస్) ఎన్నిక సక్రమమే అంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. అన్నా డీఎంకే పార్టీపై తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు పన్నీర్ సెల్వం (ఒపిఎస్) చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పన్నీరు సెల్వం వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

సుప్రీం కోర్టు తీర్పుతో పళని స్వామి వర్గం సంబరాల్లో మునిగిపోయారు. విజయ సంకేతం చూపిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. పళని స్వామి చిత్రపటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వర్గీయులు, పార్టీ నేతలు పాలాభిషేకం చేస్తూ బాణా సంచా కాలుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జులై 11న జరిగిన అన్నా డీఎంకే జనరల్ బాడీలో పళని స్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అయితే ఈ ఎన్నిక చెల్లందంటూ పన్నీర్ సెల్వం, జనరల్ కమిటీ సభ్యుడు వైరముత్తు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఆ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ పళిని స్వామి వర్గం హైకోర్టు లో అప్పీల్ చేసింది. ఈ కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధిస్తూ పళని స్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికను సమర్ధించింది. ఈ తీర్పుపై పన్నీరు సెల్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ పన్నీరు సెల్వం పిటిషన్ ను తోసిపుచ్చింది.