Rahul Gandhi: ప్రధాని మోడీ ఇంటి పేరుపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారన్న కేసులో గుజరాత్ లోని సూరత్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన లోక్ సభ సభ్యత్వంపై కూడా అనర్హత వేటు పడింది. ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని కూడా లోక్ సభ సెక్రటేరియేట్ ఆదేశాల మేరకు ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలోనే పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని సూరత్ లోని సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు.

ట్రయల్ కోర్టు తన పట్ల కఠినంగా వ్యవహరించిందని తన పిటిషన్ లో పేర్కొన్నారు. రెండేళ్ల శిక్ష విధించేంత కేసు ఇది కాదని అన్నారు. జైలు శిక్ష నిలిపివేయకపోతే తన ప్రతిష్ఠకు చాలా నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. అయితే మెజిస్ట్రేట్ కోర్టు తీర్పుపై స్టే విధించేందుకు సెషన్స్ కోర్టు నిరాకరించింది. రాహుల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇక రాహుల్ హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పై అనర్హత వేటు వేయడంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. రాహుల్ గాంధీ గొంతు నొక్కేందుకే కేంద్రం ఇటువంటి నిర్ణయం తీసుకుందనీ, ఈ విషయంలో న్యాయపరంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ ఇంతకు ముందే తెలిపింది.