Uddhav Thackeray:: మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం ఎన్‌డీఏలో కొనసాగిన శివసేన గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పీఠంపై పేచీ రావడంతో బీజేపీతో శివసేన దోస్తాన్ కటీఫ్ చెప్పేసి కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే సీఎం ఉద్దవ్ థాకరే గత నెలలో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవడం జరిగింది. ఆ తరువాత నుండి రాష్ట్రంలో శివసేన, బీజేపీ మళ్లీ దోస్తాన్ చేయనున్నాయంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.

Read More: Bhuma Akhila priya: భూమా అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు నమోదు
ఈ తరుణంలో శివసేన, ఎన్సీపీ నేతలు అయిదేళ్లు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఉద్దవ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ ఇటీవల బీజేపీకి శివసేన శత్రువు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఈ రెండు పార్టీల కలయికపైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో పరిస్థితులను బట్టి సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఫడ్నవీస్ చేసిన ఈ కీలక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో శివసేన అధినేత, సీఎం ఉద్దవ్ థాకరే స్పందించారు.
బీజేపీతో శివసేన మళ్లీ కలవనుందని జరుగుతున్న ప్రచారాన్ని ఉద్దవ్ థాకరే ఖండించారు. అవి నిరాధారమైన వార్తలని కొట్టిపారేశారు. బీజేపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో నానా యాగీ చేస్తున్నారనీ, వారి తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలాంటిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో మళ్లీ శివసేన కలిసేది లేదని సీఎం ఉద్దవ్ థాకరే స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారన్న అభియోగంపై 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు అసెంబ్లీ నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే.