అబ్బే! ఆ అవకాశం లేదు : గడ్కరీ

2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తనను తెరమీదకు తీసుకురానున్నారన్న వార్తలను కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ తోసి పుచ్చారు. అటువంటి అవకాశం ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికలలో విజయం సాధించి తిరిగి అధికారంలోనికి రావాలంటే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నితిన్ గడ్కరీని  తెరమీదకు తీసుకురావాలని ఆర్ఎస్ఎస్ మహారాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ తివారీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈయన ఈ మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు లేఖ కూడా రాశారు. అలాగే ఆర్ఎస్ఎస్ కు చెందిన పలువురు నేతలే కాకుండా బీజేపీ ఎంపీల నుంచి కూడా ఇదే విధమైన డిమాండ్ వస్తున్నదని చెబుతున్నారు. మోదీ, అమిత్ షా ద్వయం తమ అహంకార పూరిత వైఖరితో మిత్రులను దూరం చేసుకుంటున్నదన్న అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమౌతున్నదని ఆయనా లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయానికి వారి వైఖరే కారణమని కిషోర్ తివారి తన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో నితిన్ గడ్కరీ స్పందించారు. ప్రధాని అభ్యర్థిగా తెరమీదకు రావాలన్న ఉద్దేశం తనకే కొసానా లేదని స్పష్టం చేశారు.