ఆర్టీజీసీ అద్భుతం

పెథాయ్ తుపాను నష్ట తీవ్రతను తగ్గించడంలో ఆర్టీజీసీ సేవలు అద్భుతమన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తుపాను గమనాన్ని, వేగాన్ని, అది తీరం దాటే సమయాన్ని కచ్చితంగా అంచనావేసి..అందుకు తగ్గట్టుగా సత్వర చర్యలు చేపట్టడంలో, ప్రభావిత ప్రాంతాలకు ఆఘమేఘాల మీద సహాయక బృందాలను పంపడంలోనూ ఆర్జీజీఎస్ పని తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతికతను వినియోగించుకుని పెథాయ్ పెను తుపాను కారణంగా పెనునష్టం వాటిల్లకుండా నివారించడంలో ప్రభుత్వానికి ఆర్టీజీఎస్ ఒక ఆయుధంగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. పెథాయ్ కదలకిలను ముందుగానే పసిగట్టి అందుకు అనుగుణంగా యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలోనూ…తుపాను తీరం దాటిన తరువాత నష్టం ప్రభావాన్ని సాధ్యమైనంత తక్కువకు పరిమితం చేయడానికి ఆర్టీజీఎస్ ద్వారా ముందస్తు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి వీలుగలిగింది. ఎక్కడ చెట్లు కూలాయి, ఎక్కడ విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి వంటి సమాచారాన్ని ఆర్టీజీఎస్ ద్వారా ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు అక్కడి యంత్రాంగానికి అందించి నివారణ చర్యలు తీసుకోవడంలో వేగంగా కదిలేందుకు వీలు కలిగింది. దీంతో ఆర్టీజీఎస్ ద్వారా సాంకేతికను సమర్ధంగా వినియోగించుకుని ప్రభుత్వం  విపత్తును ఎదుర్కొని నష్టాన్ని నివారించిన తీరు పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.