ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలం

104 views

పెథాయ్ తుపాను ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నది. తూర్పోగోదావరి జిల్లా ఉప్పాడ తీరంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి.సముద్రం అల్లకల్లోలంగా ఉంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు తీర ప్రాంత గ్రామాల ప్రజలను తుపాను షెల్టర్లలోకి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యే దొరబాబు తీర ప్రాంత గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పెథాయ్ తీవ్ర తుపానుగా మారి కోస్తా జిల్లాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయానికి తుపాను మచిలీపట్నం-అమలాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిద్ధం చేశారు. అమరావతిలో ఆర్టీజీఎస్ నుంచి అనుక్షణం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు.