ఎంపీలో మాయా మద్దతు కాంగ్రెస్ కే

మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరు అధికారం చేపడతారన్న సస్పెన్స్ కు తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క సీటు దూరంలో నిలిచిన నేపథ్యంలో అధికారం హస్తగతమౌతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ 109 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇతరులు 5గురు విజయం సాధించడంతో వారి మద్దతు పొందిన వారికే అధికారం దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్,బీజేపీలు తమతమ కసరత్తు ప్రకటించాయి.

అయితే బీఎస్పీ అధినేత మాయావతి…కాంగ్రెస్ లో చాలా విషయాలలో విభేదాలున్నప్పటికీ మధ్య ప్రదేశ్ లో తమ సభ్యులు కాంగ్రెస్ కే మద్దతు ఇస్తారని ప్రకటించడంతో సస్పెన్స్ కు తెరపడింది. మధ్యప్రదేశ్ లో ఇద్దరు బీఎస్పీ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే.  230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 114 స్థానాలలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ 109 స్థానాలలో గెలుపొంందింది. బీఎస్పీ 2 స్థానాలలో విజయం సాధించగా, ఇతరులు 5 స్థానాలలో గెలిచారు. కాంగ్రెస్ విధానాలతో తాము ఏకీభవించకపోయినా ఆ పార్టీకే మధ్యప్రదేశ్ లో మద్దతు ఇస్తామని మాయావతి స్పష్టం చేశారు. దీంతో ఎంపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది.