ఎన్డీయే సీట్ల సర్దుబాటు ఇదీ!

బీహార్ లో ఎన్డీయే సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీహార్ లో బీజేపీ, జేడీయూలు చెరో 17 స్థానాలలోనూ పోటీ చేస్తాయి. ఇక ఎల్జీపీ 6 స్థానాలతో సరిపెట్టుకుంటుంది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఎల్జీపీ నేత రామ్ విలాస్ పశ్వాన్ లు సంయుక్తంగా ప్రకటించారు. ఇక ఎల్జీపీకి యూపీ, జార్ఖండ్ లలో కూడా ఒక్కో లోక్ సభ స్థానాన్ని కేటాయించడానికి మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరింది.

దీంతో గత కొద్ది కాలంగా  బీహార్ లో మిత్రపక్షాల మధ్య నెలకొన్న పొరపొచ్చాలు సమసిపోయినట్లైంది. జేడీయే, ఎల్జేపీలు కూడా తాము పోటీ చేసే స్థానాల సంఖ్యపై స్పష్టత ఇవ్వాలనీ, లేకుండా ఎన్డీయే నుంచి వైదొలగుతామని బీజేపీపై ఒత్తిడి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. జేడీయూ, ఎల్జీపీలు ఒక దశలో మహాగట్బంధన్ లో భాగస్వాములౌతాయని కూడా వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన బీజేపీ సీట్ల సర్దుబాటు విషయంలో విస్తృత చర్యలు జరిపి ఆ పార్టీలతో ఒక అవగాహనకు వచ్చింది.