ఎన్నికల్లోనే ప్రత్యర్థులు…!

భారత రాజకీయాలలో ఇటీవలి కాలంలో కనిపించని అరుదైన దృశ్యం నిన్న ఆవిష్కృతమైంది. రాజకీయాలలో ప్రత్యర్థులు అన్న మాటను నేతలు మరచిపోయి శత్రువుల్లా మెలుగుతున్న వేళ ప్రత్యర్థులు అప్యాయంగా పలకరించుకోవడం, కలివిడిగా మెలగడం రాజకీయాలలో కొత్త మార్పునకు సంకేతమా అని పించింది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా అశోక్ గెహ్లాట్, కమల్ నాథ్ ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. తాజాగా జరిగిన రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లలో బీజేపీ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోవడం, విజయం సాధించి కాంగ్రెస్ అధికారం చేపట్టడం జరిగింది.

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లీట్ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం వసుంధరరాజె హాజరయ్యారు. అలాగే మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. వీరిరువురూ కూడా కొత్త ముఖ్యమంత్రులను ఆప్యాయంగా పలకరించి అభినందించడమే కాకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులతో కలివిడిగా తిరుగుతూ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఒక ఆత్మీయ సమావేశంగా మార్చేశారు. గెహ్లాట్ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన జ్యోతిరాదిత్య సింధియాను రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరరాజె ఆప్యాయంగా పలకరించారు. అలాగే కమల్ నాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన శివరాజ్ సింగ్ చూహాన్ కొత్త సీఎంను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని మరీ అభినందించారు. ఆ తరువాత కూడా వేదికపై కలివిడిగా తిరుగుతూ, కమల్ నాథ్ తో కలిసి అభివాదం చేశారు.  రాజకీయాలలో ఇటువంటి వాతావరణం ఆహ్వానించదగ్గ పరిణమామం అనడంలో సందేహంలేదు.