ఎమర్జెన్సీలో ఉన్నాం :కేజ్రీవాల్

దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన దేశ వ్యాప్తంగా కంప్యూటర్లపై నిఘా అంటే అప్రకటిత ఎమర్జెన్సీయేనని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ కంప్యూటర్ లో నిక్షిప్తమై ఉన్న ఏ సమాచారాన్నైనా సేకరించే అధికారాన్ని పోలీసులకు దఖలు పరచడం అంటే వ్యక్తిగత గోప్యతకు, స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని కేజ్రీవాల్ విమర్శించారు.

ప్రధానిగా మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి అంటే 2014 నుంచి దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉందని విమర్శించారు. ఇప్పుడా అత్యయిక పరిస్థితి పీక్స్ కు చేరిందని, అన్ని హద్దులనూ చెరిపేసి చివరికి వ్యక్తుల వ్యక్తిగత (పర్సనల్) కంప్యూటర్లలో సమాచారాన్ని సైతం సేకరించే స్థాయికి చేరుకుందని కేజ్రీవాల్ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి పరిస్థితి దారుణమని, దీనికి ఎంతమాత్రం సహించరాదని కేజ్రీవాల్ అన్నారు.