ఎస్పీ, బీఎస్పీ పొత్తుకు ఓకే

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీల మధ్య సయోధ్య ఖరారైంది. ఈ విషయాన్ని మాయావతి పుట్టిన రోజైన జనవరి 15న అధికారికంగా ప్రకటించాలని ఇరుపార్టీల అధినాయకత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వాదీ పార్టీలు తమ మధ్య విభేదాలను పక్కన పెట్టి మరీ సమష్టిగా పని చేస్తున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికలలో కూడా ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుని సత్ఫలితాలు సాధించాయి. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు విషయంలో కూడా ఈ రెండు పార్టీలూ సుముఖంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీలకూ కాంగ్రెస్ విషయంలో కొన్ని అభ్యంతరాలున్నప్పటికీ బీజేపీని గద్దె దింపే విషయంలో ఆ అభ్యంతరాలను పక్కన పెట్టి ముందుకు కలిసే అవకాశాలున్నాయన్నది ఆ రెండు పార్టీల వర్గాల కథనం.

కర్నాటకలో కుమార స్వామి ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఎస్పీ, బీఎస్పీ నేతలు హాజరైన సంగతి తెలిసిందే. దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కలిసి  పని చేయాలని రెండు పార్టీలూ భావిస్తున్నాయి. కాగా ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షాలైన ఈ రెండూ యూపీ అసెంబ్లీ ఎన్నికలలో వేరువేరుగా పోటీ చేసి దెబ్బతిన్నాయి. అనూహ్యంగా బీజేపీ  సంపూర్ణ మెజారటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఆ తరువాత రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికలలో రెండు పార్టీలూ కలిసి ఉమ్మడిగా పోటీ చేయడంతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా పొత్తు పెట్టుకుని బీజేపీని దెబ్బతీయాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే వీరి మధ్య సయోధ్య కుదిరింది.

SHARE