ఓడిపోలేదు…వెనుకబడ్డామంతే..

మధ్య ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోలేదు…వెనుకబడిందంతే…ఈ మాటలన్నది ఎవరో కాదు ఆ  రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్  చౌహాన్. మధ్య ప్రదేశ్ లో బీజేపీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై అభినందనలు తెలిపిన శివరాజ్ సింగ్ బౌహాన్ ఈ రోజు తన స్వంత నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకధాటిగా మూడు పర్యాయాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తాజా ఎన్నికలలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదని, బీజేపీ సుపరిపాలనే అందుకు కారణమని అన్నారు. ఈ ఎన్నికలలో మనం ఓడిపోలేదు…కేవలం కొన్ని సీట్లు వెనుక బడ్డామంతే అని చెప్పారు. పులి ఇంకా బతికే ఉందని ఆయన తాను ప్రజలలోనే ఉంటాననే సంకేతాలిచ్చారు.

రాష్ట్ర పురోభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తాను పాటుపడతానని చెప్పారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని విధాలుగా సహకరిస్తానని చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. అయితే ప్రజలు ఇబ్బందులకు గురౌతే మాత్రం చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించాలని బీజేపీ భావిస్తున్నది. అయితే ఆయన మాత్రం తాను రాష్ట్రానికే పరిమితమౌతానని, మధ్య ప్రదేశ్ ప్రజల పక్షానే పని చేస్తానని స్పష్టం చేశారు.

SHARE