ఎమర్జెన్సీ ప్రకటించేస్తే పోలా!

దేశంలో ఏ కంప్యూటర్లపై నిఘా పై శివసేన మోడీపై ఫైర్ అయ్యింది. దేశంలోని ఏ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్నైనా తెలుసుకునేందుకు కేంద్రం పది ఏజెన్సీలకు అధికారాలను దఖలు పరచడాన్ని శివసేన తప్పుపట్టింది. ఇది సుప్రీం కోర్టు విస్పష్టంగా చెప్పిన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు మనీషా కయాండే అన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ వ్యవహార శైలి దేశంలో స్వేచ్ఛను హరించేదిగా ఉందని విమర్శించారు. వ్యక్తిగత కంప్యూటర్లపై  నిఘా పెట్టడం అంటే దేశంలో నియంతృత్వ పాలన సాగుతున్నట్లేనని పేర్కొన్నారు. ఇంత కంటే దేశంలో అధికారికంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఉండాల్సిందని ఆమె పేర్కొన్నారు. దేశంలోని ప్రతి కంపూటర్ పై నిఘాకు పది సంస్థలకు అధికారాన్ని కట్టబెడుతూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై లోక్ సభ భగ్గుమంది. విపక్షాలు కేంద్రంపై విమర్శల వర్షం కురిపించాయి. ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది.

ఈ చర్య ద్వారా ప్రధాని నరేంద్రమోడీ తాను నియంతనని నిరూపించుకున్నారంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దేశాన్ని పోలిసు రాజ్యంగా మార్చడం ద్వారా ప్రజా వ్యతిరేకతను అడ్డుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గట్టెక్కాలని మోడీ ప్రయత్నిస్తున్నారని, అయితే ఆ ప్రయత్నం ఫలించదని రాహుల్ పేర్కొన్నారు.