కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నా కల్వకుర్తిలో జరిగిన సంఘటన ఉద్రిక్తతలకు దారి తీసింది. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచరణ్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి కాలప్పడ్డారు. నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సరళిని పరిశీలించడంలో భాగంగా అమనగల్ మండలం జంగారెడ్డి పల్లి గ్రామానికి వెళ్లిన వంశీచరర్ రెడ్డిని బీజీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వంశీచరణ్ రెడ్డి గాయపడ్డారు. దీంతో ఆయనను హుటాహుటిన నిమ్స్  కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ఇలా ఉండగా ఈ దాడి ఘటనను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతోనే బీజేపీ, టీఆర్ఎస్ లు దాడులకు దిగుతున్నారని విమర్శించారు. తాండూరులోనూ, మధుయాష్కీపైనా  జరిగిన దాడులను ఈ  సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పోలింగ్ సరళిపట్ల  సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ప్రజాకూటమి విజయంపై ధీమా వ్యక్తం చేశారు.