కాంగ్రెస్ కు సజ్జన్ కుమార్ రాజీనామా

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జన్ కుమార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1984 సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ హైకోర్టు సజ్జన్ కుమార్ ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పు వెలువడిన మరుసటి రోజే ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత రాహుల్ గాంధీకి రాసిన లేఖలో సిక్కు వ్యతిరేక అల్లర్లలో తనను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువడిన నేపథ్యంలో తాను పార్టీ ప్రథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అంతకు ముందు ఈ ఉదయమే ఆయన కన్నాట్ ప్లేస్ లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా విలేకరులు ఆయనను చుట్టుముట్టి కోర్టు తీర్పుపై ప్రశ్నల వర్షం కురింపించారు. అయితే ఆయన ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు.