కాకినాడ వద్ద తీరం దాటనున్న పెథాయ్

పెను తుపాను పెథాయ్ కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మధ్యాహ్నానికి పెథాయ్ కాకినాడ వద్ద తీరం దాటుతుందని, ఆ సమయలో గంటలకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే కాకినాడ వద్ద 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కాకినాడ హోప్ ఐలండ్ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉప్పాడ వద్ద సముద్ర అలలు భయం గొల్పుతున్నాయి. అలాగే అంతర్వేది వద్ద కూడా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఓడల రేవు, బెండమూర్లంక వద్ద సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. తీర ప్రాంత వాసులు భయం గుప్పెట్లో చిక్కుకున్నారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పెథాయ్ ప్రభావంతో ఇప్పటికే ఉభయ గోదావరి  జిల్లాలలో పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత గ్రామాలలో పెనుగాలుల తీవ్రత కూడా కనిపిస్తున్నది. అధికారులు అప్రమత్తమై తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకుతరలిస్తున్నారు.తుపాను ప్రభావం ఉభయగోదావరి జిల్లాలలో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై కూడా తీవ్రంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు.