కింకర్తవ్యం: టీడీపీ మథనం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు దిమ్మతిరిగేలా చేశాయి. దశాబ్దాల విభేదాలను పక్కన పెట్టి తెరాస ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రజాకూటమిగా ఏర్పడి ఎన్నికల రణరంగంలోకి దిగాయి. అయితే ఆ రెండు పార్టీల దోస్తీని తెలంగాణ ప్రజలు ఆమోదించలేదని ఫలితాల సరళి విస్పష్టంగా తేల్చేసింది. ఏ పార్టీ వల్ల ఎవరు ఎక్కువ నష్టపోయారన్న చర్చ   కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో ఇప్పటికే ప్రారంభమైంది. సెటిలర్ల ఓట్లు అధికంగా ఉన్న హైదరాబాద్ లో కూడా తెలుగుదేశం వెనుకబడటానికి కారణం కాంగ్రెస్ తో చేతులు కలపడమే అని తెలుగుదేశం మథన పడుతుండగా, తెలుగుదేశంతో దోస్తీ కట్టిన ఫలితం తెలంగాణలో ఉన్న బలాన్ని కూడా పోగొట్టుకున్నామని కాంగ్రెస్ లో ఆవేదన వ్యక్తమౌతున్నది. గత ఎన్నికలలో సాధించిన స్థానాలను కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు గెలుచుకోలేకపోవడంపై రానున్న రోజులలో ఇరుపార్టీలూ పరస్పరం నిందలు మోపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీలూ కూడా భవిష్యత్ లో రాష్ట్రంలో మరింత బలహీనపడే పరిస్థితులే ఎక్కువ ఉన్నాయి.

ఇక జాతీయ స్థాయిలో బీజేపీ కూటమి ఏర్పాటు విషయంలో చంద్రబాబు చొరవకు ఈ ఫలితాలు బ్రేకులు వేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయి కూటమి విషయంలో చంద్రబాబు చొరవ కారణంగానే కొన్ని పార్టీలూ దూరంగా ఉన్నాయన్న భావన వ్యక్తమౌతున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితం కూటమి ఏర్పాటుకు బ్రేకులు వేసే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అదే సమయంలో  ఏపీలో పార్టీ పరిస్థితి, విపక్షాల బలంపుంజుకోవడానకి ఈ ఫలితాలు మరింత అవకాశాలను మెరుగుపరిచే అవకాశాలున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇక జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశాలు పెద్దగా లేవన్న భావన వ్యక్తమౌతున్నది. ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయ ప్రణాళికలకు, వ్యూహాలకు తెలంగాణ ఎన్నికల ఫలితం ఒకింత ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుంది.