కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్ కాదా?

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై జరుగుతున్న ప్రయత్నాలకు డీఎంకే నాయకుడు స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు గండికొట్టనున్నాయా అన్న చర్చ విస్తృతంగా జరుగుతున్నది. ఇటీవల చెన్నైలో జరిగిన డిఎంకే అధినాయకుడు కరుణానిథి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్ అని పేర్కొన్నారు. నాటి ఆ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు విపక్ష నేతలు కూడా ఉన్నారు. అందరి సమక్షంలో స్టాలిన్ రాహుల్ పై చేసిన ఈ వ్యాఖ్య కూటమి పార్టీలలో కలకలం సృష్టించింది. కూటమి ప్రధాని అభ్యర్థి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీయే అంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పలువురు నేతలకు ఖండించారు. అది స్టాలిన్ వ్యక్తిగత అభిప్రాయం అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ కూడా ఈ విషయంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్ధించలేమని పేర్కొంది. అది స్టాలిన్ వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండొచ్చని వ్యాఖ్యానించింది. తాజాగా సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కూడా అదే మాట అన్నాడు. రాహుల్ ప్రధాని అభ్యర్థి అన్న అభిప్రాయం కూటమి సభ్యులందరిదీ కాదని స్పష్టం చేశారు.  కూటమి ప్రధాన అభ్యర్థి ఎవరన్నది కూటమి సభ్యులందరం కలిసి సమష్టిగా నిర్ణయిస్తామని అఖిలేష్ పేర్కొన్నారు.