కూటమి యత్నాలకు మాయావతి షాక్

జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి యత్నాలకు మాయావతి ఝలక్ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలలోనూ బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న 29 లోక్ సభ స్థానాలలోనూ బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేస్తారని బీఎస్పీ ఉపాధ్యక్షుడు రామ్ జీ గౌతం ఈ రోజిక్కడ ప్రకటించారు. మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మద్దతు ఇచ్చిన మాయావతి లోక్‌సభ ఎన్నికలలో ఒంటరిగానే అన్ని స్థానాలలోనూ పోటీ చేయనున్నట్లు చెప్పడం కూటమి ఏర్పాటుకు అవరోధంగానే పరిశీలకులు భావిస్తున్నారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా మాయావతి పార్టీ ఒంటరిగానే పోటీలో దిగిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు వెలువడిన అనంతరం ఆ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. దీంతో అధికారం చేపట్టడానికి ఒక సీటు దూరంలో నిలిచిపోయిన కాంగ్రెస్ మాయావతి మద్దతు ప్రకటించడంతో రాష్ట్రంలో అధికారం చేపట్టింది. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీఎస్పీ బీజేపీయేతర కూటమిలో భాగస్వామి అవుతుందన్న భావన వ్యక్త మైంది. అయితే మధ్య ప్రదేశ్ లో బీఎస్పీ అన్ని లోక్ సభ స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెట్టడానికి నిర్ణయించడం కూటమి ఆశలకు గండికొట్టింది.