కేటీఆర్‌కు పగ్గాలు ; హరీశ్‌కు చెక్

Share

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల తారకరామారావు పార్టీ పగ్గాలను తనయుడు కేసీఆర్ కు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం మేనల్లుడు హరీష్ రావుకు చెక్ పెట్టడంగానే పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తనయుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలను అప్పగించాలన్న ఉద్దేశం కేసీఆర్ లో చాలా కాలంగానే ఉన్నప్పటికీ…తాజా ఎన్నికలలో పార్టీకి భారీ మెజారిటీ రావడంతో కార్యరూపంలోనికి తీసుకురావడానికి ఇదే సరైన సమయంగా ఆయన భావించారు. అందుకే సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే తన వ్యూహాన్ని కార్యరూపంలోనికి తీసుకువచ్చారు. తన నిర్ణయాన్ని గట్టిగా విమర్శించే స్థితిలో విపక్షాలు లేని సమయం ఇది అని ఆయన భావించారు. గత కొంత కాలంగా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలలో హరీష్ రావు ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తున్నారన్న సంగతి అందరూ గుర్తించినదే. ఎన్నికల ప్రచారం ఆరంభం కావడానికి కొద్ది కాలం ముందు వరకూ టీఆర్ఎస్ అధికార పత్రిక నమస్తే తెలంగాణలో కూడా హరీష్ రావు వార్తలకు ప్రాధాన్యత తగ్గిన విషయాన్ని పార్టీ వర్గాలే గుర్తించి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. పార్టీ సీనియర్ నేతల అంతర్గత సంభాషణల్లో కూడా ఈ విషయం తరచుగా ప్రస్తావనకు వచ్చింది.  కానీ ముందస్తుకు ముందే హరీష్ రావును పూర్తిగా విస్మరించి కేటీఆర్ కు పగ్గాలు అప్పగిస్తే ఎన్నికలలో ఏదో మేరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఎన్నికల సమయంలో కూడా కీలకం, ప్రతిష్టాత్మకం అనుకున్న కొడంగల్, గజ్వేల్ వంటి నియోజకవర్గాలలో పార్టీ గెలుపు బాధ్యతను పూర్తిగా హరీష్ రావు భుజస్కంధాలపై వేసి, పార్టీ అభ్యర్థుల ఎంపిక, అసమ్మతులను బుజ్జగించడం వంటి కీలక బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారు. వాస్తవానికి కేటీఆర్ కు అప్పగించిన బాధ్యతల కంటే హరీష్ కు అప్పగించిన కొడంగల్, గజ్వేల్ నియోజకవర్గాల బాధ్యత అత్యంత క్లిష్టమైనది. ఎందుకంటే రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి వంటి వారికి ప్రజలలో అపారమైన ఆదరణ ఉంది. మిగిలిన రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉన్నా…ఆ రెండు నియోజకవర్గాలలో ఆ ఇద్దరి విజయానికీ అవకాశాలున్నాయన్న అంచనాలున్నాయి. ముఖ్యంగా కొడంగల్ లో రేవంత్ రెడ్డికి ఎదురేలేదన్న ప్రచారం కూడా సాగింది. దానికి తోడు ప్రభుత్వంపైనా, కేసీఆర్ పైనా విమర్శల దాడిని కొనసాగించడంలో రేవంత్ శైలి మిగిలిన కాంగ్రెస్ నేతలకు భిన్నంగా ఉండటమే కాకుండా ప్రజలలో ఏదో మేరకు ప్రభావితం చేయగలిగేలా ఉంటాయన్న భావన కూడా కలిగింది. ఈ నేపథ్యంలో అటో ఇటో అనుకునే క్లిష్టమైన నియోజకవర్గాల బాధ్యత హరీష్ కు అప్పగించి…కచ్చితమైన గెలుపు అవకాశాలున్న వ్యవహారాలను కేటీఆర్ కు అప్పగించడం ద్వారా కేసీఆర్ తన వ్యూహాలను, ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేశారు.

అలాగే అభ్యర్థుల ఎంపికలో కేటీఆర్ కు అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వడం ద్వారా అసెంబ్లీలో కేటీఆర్ కు మద్దతుగా నిలిచే ఎమ్మెల్యేల సంఖ్య బాగా పెరిగేలా చేశారు. దానికి తోడు టీఆర్ఎస్ కు తిరుగులేని మెజారిటీ రావడం కూడా కేటీఆర్ కు పగ్గాలు అప్పగించినా ఎటువంటి అభ్యంతరాలూ వ్యక్తం కాని, వ్యక్తం చేయలేని పరిస్థితి పార్టీలోనూ, నేతలలోనూ వచ్చింది. మొత్తం మీద ముందస్తు విజయం కేసీఆర్ తనయుడికి పగ్గాలు అప్పగించి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడానికి వీలు కలిగించింది. అదే సమయంలో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేటీఆర్ పట్టు పెంచుకోవడానికి అవకాశం కలిగించింది. అదే సమయంలో హరీష్ ప్రమేయాన్ని, ప్రాముఖ్యతను మరింత తగ్గించేందుకు తోడ్పడింది.


Share

Related posts

కీర్తి సురేష్ .. కాజల్ అగర్వాల్ ని కాదని తాప్సీ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ..!

GRK

KCR: షాక్ః కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌నే లైట్ తీసుకుంటున్న అధికారులు

sridhar

 పులివెందులలో 5 వేల కోట్ల అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన

somaraju sharma

Leave a Comment