కేసీఆర్ తో అసద్ భేటీ

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో ఈ భేటీ జరగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతర పరిణామాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. పెద్దగా ప్రచారార్భాటం లేకుండా అసదుద్దీన్ ఒవైసీ బైక్ పై ప్రగతి భవన్ కు చేరుకున్నారు. హఠాత్తుగా ఒవైసీ కేసీఆర్ ను కలుసుకోవడం పై రాజకీయ వర్గాలలో పలు రకాల ఊహాగానాలకు తెరలేచింది. తెలంగాణలో హంగ్ ఏర్పడితే తాము టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తామంటూ బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో అసదుద్దీన్ కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ కూడా మాకు మజ్లిస్ ఉంది. బీజేపీ మద్దతు అవసరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిరువురి భేటీతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడే  అవకాశం ఉందనడానికి వీరి భేటీ తార్కాణమన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. గెలుపుపై తెరాస, ప్రజాకూటమి ధీమా వ్యక్తం చేస్తున్న తరుణంలో హంగ్ గురించిన చర్చ తెరపైకి రావడం, ప్రజాకూటమి నేతలు గవర్నర్ తో భేటీ కావడంతో రేపు రానున్న ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది.