కొందరు సంపన్నులు కుళ్లిన బంగాళాదుంపలు

భారత దేశంలో  కొందరు సంపన్నులు కుమార్తె వివాహానికి వందల కోట్లు వ్యయం చేస్తారు కానీ, సేవా కార్యక్రమాలు చేపట్టరని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. దేశంలో సంపన్నులు కుళ్లిన బంగాళా దుంపలని, వారు సమాజానికి ఉపయోగపడరని వ్యాఖ్యానించారు. జమ్మూ లో సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

కుమార్తె వివాహానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు కానీ సమాజం కోసం స్వచ్ఛందంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఇటువంటి వారు తన దృష్టిలో కుళ్లిన బంగాళాదుంపలతో సమానమని సత్యపాల్ మాలిక్ అన్నారు.

కుమార్తె వివాహానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా ఆయన దేశ సంపదను ఏమైనా పెంచుతున్నారా అని ప్రశ్నించారు. అదే యూరప్ దేశాలలో అయితే సంపన్నులు సమాజం కోసం ఖర్చు చేస్తారని, మైక్రోసాఫ్ట్ అధినేత తన సంపాదనలో 99 శాతం సమాజం కోసం వెచ్చిస్తారని చెప్పారు. వివాహానికి ఖర్చు పెట్టిన సొమ్ముతో రాష్ట్రంలో 700 పెద్ద పాఠశాలలు నిర్మించవచ్చనీ, అలాగే 7000 మంది అమర జవాన్ల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించవచ్చని సత్యపాల్ మాలిక్ అన్నారు.