కొత్త వివాదంలో నవజ్యోత్ సిద్దూ

తరచు వివాదాల్లోకి చిక్కుకునే అలవాటున్న పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మరో వివాదంలో పడ్డాడు. పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రాహుల్ గాంధీ యే తనను పంపించారని ఓ మీడియా సమావేశంలో పేర్కొని సంచలనం సృష్టించారు. తన కెప్టెన్ రాహుల్ గాంధీ అనీ, ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఆర్మీ కెప్టెన్ అనీ పేర్కొనడమే కాక, రాహుల్ గాంధీ కెప్టెన్ కే కెప్టెన్ అని పేర్కొన్నాడు. అయితే సిద్దూ పాక్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అనీ, రాహుల్ గాంధీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ పర్యటనతో సంబంధం లేదని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. కాగా సిద్దూ పాక్ పర్యటన, అక్కడ వివాదాస్పద వేర్పాటు వాదులను కలవడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ అసంతృప్తితో ఉన్నారు. ఈ తాజా వివాదంతో సిద్దూను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు లేకపోలేదు.