‘గజ తుపాను’ బీభత్సానికి 20 మంది మృతి

కడలూరు: తమిళనాడు రాష్ట్రాన్ని ‘గజ’ తుపాను అతలాకుతలం చేస్తోంది. శుక్రవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో నాగపట్నం-వేదారణ్యం మధ్య తీరాన్ని గజ తుపాను దాటిన సమయంలో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో తీర ప్రాంతాలు గజగజ వణికిపోయాయి. తుపాను తీరం దాటిన సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో ఉధృతంగా వీచిన గాలులతో భారీ వృక్షాలు కూకటి వేళ్ళతో నేలకు ఒరిగిపోయాయి. విద్యుత్‌ స్తంభాలైతే వేల సంఖ్యలో పడిపోయాయి. దీంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫారా ఆగిపోయింది. అనే ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండాపోయాయి.

 

తీరం దాటిన గజ తుపాను పశ్చిమ దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. గజ ప్రభావంతో పశ్చిమ, మధ్య తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తంజావూరు జిల్లా అధిరామ్‌‌పట్నంలో అత్యధికంగా 16 సెంటీమీటరల్ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా రాష్ట్రంలో 20 మంది మరణించారు. తంజావూరులో 10 మంది, తిరువారూర్‌లో నలుగురు అసువులు బాసారు. పుదుక్కోటైలో ముగ్గురు, తిరుచ్చిలో ఇద్దరు, నాగపట్నంలో ఒకరు మ‌ృతిచెందారు.

తమిళనాడు తీరప్రాంత పట్టణాలు కడలూరు, నాగపట్నం, తొండి, పంబన్‌లలోనూ, పుదుచ్చేరిలోని కరైక్కాల్, పుదుచ్చేరిలతో ఇప్పటి వరకూ 3 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంద చెన్నైలోని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

 

గజ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారటంతో తమిళనాడు, పుదుచ్చేరిలోని బీచ్‌‌లలోని ప్రవేశించవద్దని అధికారులు ఆజ్ఞలు జారీ చేశారు. నాగపట్నంలో నాలుగు, కడలూరు జిల్లాలో రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. రహదారులపై పడిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలను సహాయ సిబ్బంది ఎప్పటికప్పడు తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేస్తున్నారు. తుఫాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లోని 81,948 మందిని తంజావూరు, పుదుక్కోటై, తిరువరూర్‌లలో ఏర్పాటు చేసిన 471 పునరావాస కేంద్రాలకు తరలించి ఆశ్రయం కల్పించారు.